20150101

అపర వార్తా సంజీవనీ

బడి కంటే ముందే
పోద్దటి బదిలీ పొయ్యిన అయ్య
బడి ఇడిసినంక గూడ రాకపోతే
అమ్మా నాన్నెక్కడేనంటూ
జబ్బకేసిన బ్యాగును ఇసిరేసి
  ఏమైందో ఇంత ఆల్షం ఆయే నని
బాయి కాడికి ఉరికిన
చిన్నారుల పాదాలు .
లోడాసు నెక్కరు, నెత్తిన సేఫ్టీ ల్యాంపు
చినిగిన బూట్లతో బడిపోరని లెక్క
ఆయాసం నిండిన దేహం
చెమట నిండిన బనీను
మసి నిండిన ముఖాన్ని
బట్టల సబ్బుతో పెయ్యి రుద్దుకుంటండు.
చెమర్చిన చేతులతో
మరో ప్రాణాన్ని తాకితే
గుండెల నిండిన బరువంతా
ఒక్కసారి దిగినట్టుంది.
ఈడికేందుకచ్చినవ్ రా ?
అని గద్దరించిన ఆ గద్దరింపు లో
తండ్రి రెక్కల కష్టం
పిల్లానికి తెల్వద్దనే తపన మాత్రం
గొంతులో దాగింది.
తెగిన రెక్కకి ప్రాణం ఊది పంపినట్టు
ఎగురుకుంటూ, కాలరెగిరేసుకుంటూ
నానమ్మ నాన్నత్తండే అని చెప్పిన మాట 
ఓ అమ్మ ప్రతీ రోజు వినాలనుకునే
అపర వార్తా సంజీవనీ  ...    

20141231

హాప్పీ న్యూ ఇయర్

నూతన సంవత్సరం
ఆనంద వేడుకలు
హహ్హహ్హ...
జరుపుకోండి
లెక్కించడం మరవొద్దు సుమా
సంవత్సరాన్ని నెలలనే ముక్కలుగా
వారాల చెక్కలుగా
గంటల బొక్కలను
నిమిషాల రక్తపు సుక్కలుగా
నరకండి.
గతేండ్లలో జరిగిన
మారణ హోమాలన్నింటిని
తారీఖులకతికించాలి కదా ,
ఏనాడో జరిగిన విషాద చాయలకు
అచ్చులు పోసి మరీ విలపించండి. 
జరుపుకొండి నూతన సంవత్సర వేడుకలు
ఈ క్షణికం కోసమేనేమో ,
కొన్ని వేల కన్నీటి క్షణాలను
దాటుకుంటూ వచ్చింది.
ఆకాశాన్నంటే కాంతి పుంజాలను
విసురుతూ సంబరపడండి.
జరిగిపోయిన దారుణాలను
రోజుల గోడలకు అతికించి ఆనందిద్దాం.
చితికి పోయిన గడియలను
విడమరిచి వివరిద్దాం.
పాత సంవత్సరం జరిగిన
ప్రతీ విషయాన్ని తడిమెందుకు
కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరిద్దాం.
దినాల దిక్సూచి లో పొద్దులన్నీ నలుపెక్కి పోయినవే
నువ్వు నవ్వుకోడానికి అక్కడక్కడ
కొన్ని రోజులే నిర్ణయించబడ్డాయి.
నవ్వే విషయాన్ని మాత్రం
చరవాణి లో ముందే భద్రపరుచుకో
మరిచిన ఆ నవ్వు కోసం
మరెన్నిసార్లు ఏడవాల్సి వస్తుందో ?
ఈ గడియ గడిస్తే
మళ్ళీ మనం సృష్టించుకున్న
అశ్రుప్రవాహం లో
వేగంగా కొట్టుకు పోవాల్సిందే
హాప్పీ న్యూ ఇయర్ టు యు ఆల్.     

20141230

ఆశ

నా తల్లి గుండెల్లో
బంగారు ఖనిజాలున్నయని ,
నేనాడిన జాగంతా
బొగ్గు గనుల కోన అని,
గర్వంగా గొంతేత్తి అరవకముందే .
ఆఫీసులస్తయీ,
అభివృద్ధి చెందుద్ది,
కొలువులస్తే
కొంచెమన్నా కోలుకుంటం,
అచ్చురం నేర్చుకుంటే
గులిగో నలిగో కులవడి
గుమాస్తా గా నన్న పడుంటం అనకుంటే,
సర్కారు సర్వే గాళ్ళు
నా పీక సుట్టూ
కొలతల టేపు సుట్టి
నన్ను అవతలకు నెట్టిన్లు .
 ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ తో
బద్దలైన నా ఇల్లు
సరిదిద్దుకోడానికే
నా సదువంతా  అటుకెక్కింది. 
ఊరికి కొత్తగా వచ్చిన
మెర్సిడెజ్ లారీలు
తినే కంచం ల మన్ను నింపితే,
నోటి ముద్దను ఏరుకోడానికే
ఏండ్లు గడిచింది .
అప్పుడప్పుడు ఏరిగినపుడల్లా
ఎరుపచ్చినా నలుపచ్చినా
 కంపెనీ దవాఖాన్ల ఫిరీ గా
సూపిచ్చుకునే రోజత్తదనే ఆశ 
ఏ కొననో కొట్టుకుంటనే ఉన్నది.