20141231

హాప్పీ న్యూ ఇయర్

నూతన సంవత్సరం
ఆనంద వేడుకలు
హహ్హహ్హ...
జరుపుకోండి
లెక్కించడం మరవొద్దు సుమా
సంవత్సరాన్ని నెలలనే ముక్కలుగా
వారాల చెక్కలుగా
గంటల బొక్కలను
నిమిషాల రక్తపు సుక్కలుగా
నరకండి.
గతేండ్లలో జరిగిన
మారణ హోమాలన్నింటిని
తారీఖులకతికించాలి కదా ,
ఏనాడో జరిగిన విషాద చాయలకు
అచ్చులు పోసి మరీ విలపించండి. 
జరుపుకొండి నూతన సంవత్సర వేడుకలు
ఈ క్షణికం కోసమేనేమో ,
కొన్ని వేల కన్నీటి క్షణాలను
దాటుకుంటూ వచ్చింది.
ఆకాశాన్నంటే కాంతి పుంజాలను
విసురుతూ సంబరపడండి.
జరిగిపోయిన దారుణాలను
రోజుల గోడలకు అతికించి ఆనందిద్దాం.
చితికి పోయిన గడియలను
విడమరిచి వివరిద్దాం.
పాత సంవత్సరం జరిగిన
ప్రతీ విషయాన్ని తడిమెందుకు
కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరిద్దాం.
దినాల దిక్సూచి లో పొద్దులన్నీ నలుపెక్కి పోయినవే
నువ్వు నవ్వుకోడానికి అక్కడక్కడ
కొన్ని రోజులే నిర్ణయించబడ్డాయి.
నవ్వే విషయాన్ని మాత్రం
చరవాణి లో ముందే భద్రపరుచుకో
మరిచిన ఆ నవ్వు కోసం
మరెన్నిసార్లు ఏడవాల్సి వస్తుందో ?
ఈ గడియ గడిస్తే
మళ్ళీ మనం సృష్టించుకున్న
అశ్రుప్రవాహం లో
వేగంగా కొట్టుకు పోవాల్సిందే
హాప్పీ న్యూ ఇయర్ టు యు ఆల్.     

No comments:

Post a Comment