20141230

ఆశ

నా తల్లి గుండెల్లో
బంగారు ఖనిజాలున్నయని ,
నేనాడిన జాగంతా
బొగ్గు గనుల కోన అని,
గర్వంగా గొంతేత్తి అరవకముందే .
ఆఫీసులస్తయీ,
అభివృద్ధి చెందుద్ది,
కొలువులస్తే
కొంచెమన్నా కోలుకుంటం,
అచ్చురం నేర్చుకుంటే
గులిగో నలిగో కులవడి
గుమాస్తా గా నన్న పడుంటం అనకుంటే,
సర్కారు సర్వే గాళ్ళు
నా పీక సుట్టూ
కొలతల టేపు సుట్టి
నన్ను అవతలకు నెట్టిన్లు .
 ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ తో
బద్దలైన నా ఇల్లు
సరిదిద్దుకోడానికే
నా సదువంతా  అటుకెక్కింది. 
ఊరికి కొత్తగా వచ్చిన
మెర్సిడెజ్ లారీలు
తినే కంచం ల మన్ను నింపితే,
నోటి ముద్దను ఏరుకోడానికే
ఏండ్లు గడిచింది .
అప్పుడప్పుడు ఏరిగినపుడల్లా
ఎరుపచ్చినా నలుపచ్చినా
 కంపెనీ దవాఖాన్ల ఫిరీ గా
సూపిచ్చుకునే రోజత్తదనే ఆశ 
ఏ కొననో కొట్టుకుంటనే ఉన్నది.

No comments:

Post a Comment