20150604

దశాబ్దాల ఆవిర్భావాలు

నాకు తెలీకుండానే 
నా దేహం లో మరో ఆత్మ దాగుండేది. 
నాకు తెలీకుండానే 
నా నోరు వాని గొప్పదనాన్ని పలికెది. 
  కాలం అంతా కలల్లోనే గడిచేది. 
నన్ను నేను తెలుసుకున్నప్పుడు 
నా దేహాన్ని నేను తనివితీరా తడుముకున్నప్పుడు 
కళ్ళల్లో కరిగిన కళలకానాచినంతా
మాగానాలల్లో చల్లుదామంటే
నాకు తోడుగా ప్రపంచమంతా ప్రతిజ్ఞ పూనింది. 
పయనించే ఆరాటం లో 
ఎక్కడో ఓ అక్షరం 
మరింత బలాన్నిచ్చేది 
ఎక్కడో ఓ పిలుపు 
మరింత ఉత్సాహాన్నిచ్చేది. 
ఎక్కడో ఓ మరణం 
కన్నీటి శిలా శాసనాన్ని ముద్రించేది. 
రాజకుమారుల రాసలీలలు 
ఉద్యమ శిఖరాలను 
చిటికెలో చిదిమేసినప్పుడు 
మేఘాల్లా వచ్చిన వార్తలు 
వర్షించకుండా వెళ్ళినప్పుడు  
మనస్సేంతగా కృంగిపోయిందో ?
నిప్పు మింగి నిలువునా తగలబడి 
మహోద్యమాన్ని వెలిగిస్తున్నప్పుడు 
ఆ తల్లి పేగు ఎంతలా తన్లాడిందో?
తల లో తుపాకి గుండు పేల్చుకుని 
అమరత్వాన్ని  ఎగరేస్తూ ... కిష్టన్నా ... 
నువ్వు నేలకొరిగినప్పుడు 
ఆ పుస్తెలెంతగా గింజుకున్నయో ?
రాలిపోయిన మీ రూపాలను 
ఎన్ని  హృదయాలు దాచుకున్నాయో ?
నన్ను నన్నుగా నిలపాలని
ఎన్ని గొంతుకలు తపించాయో ?
విజయాన్ని తీరాన వదిలేసి
అలల్లో కలిసిన అమరులారా,
కరిగిపోతున్న కాల ప్రవాహం లో
దశాబ్దాల ఆవిర్భావాలు కొట్టుకుపోవచ్చుగానీ
ఈ మట్టి నేర్పిన త్యాగాలకు
అనుభవించే స్వేఛ్చా తీరాలకు
మీరే సజీవ సాక్షాలు...

20150503

ఆ అయిదు రోజులు


ఆ అయిదు రోజులు 

జారి పడని అండాల కండల్ని మేస్తూ
ఎదిగిన వాళ్ళే
పచ్చి బాలింతల రొమ్ముల్లో
పాలు తాగిన వాళ్ళంతా
ఏపుగా పెరిగి వేదవవాదాలు వాదిస్తూ 
పడదని పట్టరాదంటున్నారు .
ముట్టుడని ముట్టరాదంటున్నారు.
పొత్తి  కడుపులో భద్రంగా దాక్కుని
స్వేచ్చ గా పైకి ఎగిరినవాళ్ళే
సంకెళ్ళు వేస్తూ వేదిస్తున్నరు.
కటీ వలయపు కష్టాన్నంతా
పంటి బిగువన భరిస్తూ
రూపు దాల్చని
ఓ నిర్వీర్యపు కణాన్ని
తన్లాడుతూ తనువు నుండి
స్రావంగా వదిలేస్తే
తోడుండాల్సిన వారే
అందకారపు విశ్వాసాలు
అల్లిన కుచ్చుల్లో
పెంకాసు కుప్పలు పోసి నడిపిస్తున్నారు
సిసలు రోజుల్లో
అసలు మనిషినే కానట్టు
కాలు కదపడమే నేరంగా
మాట ఎత్తడమే
మహా పాపం అయినట్టు
పేరు చెప్పితే పరువే పోయినట్టు
మాస మాసానికి మనసుకి
మరణ శిక్షే విదిస్తారెందుకు ?
మొక్కుతున్న దేవుడైనా
రాలి పడని రక్తపు బిందువే
అది ఉత్పత్తికి మూలం అయిన
పవిత్ర హోమం అని
మీకు అర్దమయ్యేదెప్పుడు ?
ఆ అయిదు రోజుల్ని
అర్ధం చేసుకునేదేప్పుడు ?
 

20150417

మొలతాళీ ...

మొలతాళీ ...


మనం కొన్ని విషయాలు వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుకుందాం .

మహిళల మంగళ సూత్రాల మీద పెద్ద చర్చ, సరే ఆ తాళి కి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు దాన్ని ధరించాల్సిన అవసరం కూడా అంతగా లేదు. మరీ ఈ విషయం ఒక మహిళలకే చెందినదా అంటే ? అదీ కాదు అలాంటివి ధరిస్తున్న మగవాళ్ళు ఉన్నారు. కాకపోతే నడుము దగ్గర, మొలతాడు లాగా ...

దీన్నిగురించి నేను తెల్సుకునే ప్రయత్నం చేసినప్పుడు విచిత్ర మైన అబద్దపు నిజాలు బైట పడ్డాయి. అందులో
మొదటిది మొలతాడు ధరించిన మొగవాడు ఎత్తు పెరుగుతారు అని అయితే
రెండవది శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుందని.

ఒకవేళ గనక మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే సాధారణ భారతీయుని ఎత్తు అయిదు అడుగుల అయిదు అంగుళాలు. మొలదారాలు ధరించని సుడాన్ దేశస్తుల సగటు ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు, ఒకరకంగా మనది ప్రపంచ సగటు ఎత్తు కన్నా తక్కువే.
అంటే ఎత్తు విషయం లో మొలదారం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

రెండో విషయం లో సగటు భారతీయుని శృంగార సామర్థ్యం నలుగు నుండి ఆరు నిమిషాలు. ప్రపంచ సగటు మాత్రం ఆరు నిమిశాల ముప్పయి సెకన్ల కంటే ఎక్కువే. అంటే శృంగార పరంగా కూడా మొలదారం ఉపయోగ పడదు. ఇది పక్కా.

అలాంటప్పుడు ఈ మొలదారం మన జీవితం లోకి ఎలా ప్రవేశించింది అనే అంశాన్ని పరిశీలిస్తే, మానవుడు రాతి యుగం నుండి ఇనుప రాతి యుగం లోకి అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయం లో రెండు వేరు వేరు రకాలైన ఆయుధాలను వేటకోసం ఉపయోగించే వాడు. అలాంటి సమయం లో ఆయుదాలని చేతిలో పట్టుకోడం ఇబ్బంది గా అనిపించి నడుముకో, బుజానికో కట్టుకునే వాడు. వేటాడిన జంతువులను కాల్చుకునెందుకు ఈ తాడు ఉపయోగపడేది. అలా ఉపయోగ పడే వస్తువులను తన దగ్గరే ఉంచుకునేవాడు ఇప్పుడు సెల్ ఫోన్స్ లాగ.  ఈ తాడు జననాంగాలు కనపడకుండా కప్పుకునే వస్త్రాలను, ఆకులను కట్టి ఉంచడానికి కూడా ఉపయోగపడేది. ప్రస్తుతం అలాంటి అవసరాలను బెల్ట్ తీరుస్తుంది అనుకోండి. అందుకే ఆలోచన కలిగిన మనుషులు ఈ ఉపయోగం లేని తాడును కొన్ని వందల సంవత్సరాల క్రితమే మానేసారు.

భారతీయుల విషయం లో ఇలా జరగక పోడానికి కారణం లేకపోలేదు. ఆ కాలం లో రాజుల రధాలు, గుళ్ళు గోపురాలు నిర్మించడానికి రాళ్ళు ఈ నడుము కూ కట్టిన తాడు తోనే లాగాల్సి వచ్చేది.

అలా మనం మహిళలకి ఎలా మంగళ సూత్రాలు, మగాళ్ళకి  మొలతాడు కట్టేశాం. ఇప్పుడు మన దేశం లో మంగళ సూత్రం లేని మహిళ విధవ లా గుర్తించబడితే మొలతాడు లేని వాడు మగాడే కాదన్నట్టు   పరిగనించబడుతుంది. 

ఇంకా మనం మన బానిస గురుతులని చెరిపెయ్యడానికి కూడా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం. మనం ఇంకా ఎందుకు భ్రమల్లో బతుకుతున్నామంటారు ?
సోము రోగాపోడు మేడలో బిళ్ళ వేసుకున్నట్టు మనం కూడా మొలతాళీ  దరించాల్సిందేనా ?

Ramprasad 8897868747

20150406

ఎగిరే పతంగికి

ఈడొచ్చిందని
ఈడొచ్చి ఆడొచ్చి
జోరీగల్లా జాడవెదికి
వేదపండితుల వేదిక సాక్షిగా 
ఎగిరే పతంగికి
రెక్కలు విరిచి
నచ్చకున్నా దారపు కండెలు కట్టేసిన్లు .
బేరమాడి కొనిచ్చిన బలవంతపు బహుమానం,
నా జీవితం లోకి ప్రవేశించిన అంధకారం
నన్నడక్కుండానే నాలోకి ప్రవేశించాడు.
నిండుకున్న పాలగిలాస తో
కట్టుకున్న పునాదులు కూలిపొయ్యి
అశ్రువులు గా స్ఖలిస్తే,
ఆ కన్నీటి ఊటని చూసినప్పుడల్లా
దేహం పై గెలుపొందానన్న గర్వం
వాడి మొహం లో కొట్టోస్తుంది.
ఆ రాతి గుండెకేం తెలుసు అవి
ఓటమి లో ఒలికిన అవశేషాలని.
 చదువు కున్న పుస్తకాలన్నీ చెదలెక్కి
మట్టిలో కలిసి పొయ్యేసరికి
నెత్తుటి ముద్దలు తోడుకుంటూ
మరో శిశువు ప్రాణం పోసుకుంది.
ఇప్పుడు నేను తల్లిని మాత్రమే కాదు
ఆశల సమాధి మీద నిద్రిస్తున్న           
విధవ ను కూడా ...                           

20150218

అమర కార్మిక

వాడు దేశం కోసం
భూమి పొరలతో
కొట్లాడుతున్న సైనికుడు. 
ఒంటి చేత్తో
సముద్రాన్ని ఆపుకుంటూ,
తొంట చేత్తో
బయటకు  బొగ్గును లగేస్తున్నడు.
అంతకంతకూ కూరుకు పోయే బతుకు,
అయినా దీపం కోసం వత్తిని పేనుతనేఉన్నడు. 
ప్రతిక్షణం
ప్రకృతి తో యుద్ధం చేస్తూ,
మేలిమి బంగారాన్ని వడుకుతున్నడు.
 గంట గంట కు పెంచే
ఉత్పత్తి లక్ష్యానికి,
ఊపిరి తిత్తులను రక్షణగా నిలిపి
లోడు లాడీసు ను గుంజుతున్నడు.
నరకబడ్డ శరీర భాగాలు ,
మాంసపు ముద్దలు రుద్దుకున్న
బొగ్గు పొరలు ,
రక్తం తో పేరుకు పోయిన
భూగర్భ గనులు.
ఓ వైపు ఉబికి వచ్చే ఊటలు
హటాత్తుగా తరుముకొస్తుంటే,
ధైర్యం గా బొగ్గుపెల్లను ముద్దాడి,
నీటి ప్రవాహం లో ఆవిరై, 
అమరత్వం పొందిన వీర జవాన్లు. 
ఉత్పత్తి లో ఊపిర్లు వదిలిన 
నవ జాతి రతనాలు . 
ఈ దేశం మీకు మూడు రంగుల 
జెండా కప్పక పోవచ్చు . 
మీ వీరత్వాన్ని వినిపిస్తూ 
ఏ తుపాకి గొట్టం పేలకపోవచ్చు. 
మీ శౌర్యానికి ఏ పతకమూ 
మెడలో వాలకపోవచ్చు . 
మీ పేర్లు ఏ శిలా ఫలకం మీద 
లిఖించబడకున్నా ,
 కార్మికుల మనో ఫలకాలమీద 
ఎప్పుడూ మారుమోగుతనే ఉంటాయి. 
ఎర్ర బుగ్గలు, ఎల్ ఇ డి బల్బులు మిమ్మల్ని 
ఎల్లప్పుడూ వెలిగిస్తూనే ఉంటాయి . 
నిలిచినా మీ శ్వాసలు 
పంఖల రెక్కల్లో 
మాకు ఊపిర్లు పోస్తునే ఉంటాయి . 
   -----గని ప్రమాదాల్లో అమరత్వం పొందిన కార్మికులకు ...

20150120

అమాస ...

అమాస ...
ఒక్కసారి వచ్చి పో ,
ఈ పడు వెన్నెల్లో
వెలిగే మచ్చల మొహాలను
చూడలేకున్న .
నీ నవ్వు లేని ఆ మాసపు పూటల
వెలుగుల్లో ఎంత వెలితి కన్పించిందో ?
అమాస,
నీ చీకటిని
ఇక్కడ పదిలంగా వదిలిపో,
ఎవడో అమాంతం పగలగొట్టి
వెలుగులు పారియ్యజిక్క,
ఈ దారిద్ర్యపు దాసోహాన్ని
భరించలేకున్న .
అమాస
ఇక్కడే
ఇక్కడే ఉండిపో,
మనుషుల మద్యనే
శాశ్వతంగా నిలిచిపో,
ఈ సమాజం అప్పుడప్పుడు
నిన్ను దీపాలతో చంపేయవచ్చునేమో
నాకోసమైన నువ్వు ఏమాత్రం చెదిరిపోకు. 
చచ్చు బడిన ఈ దేహపు స్పర్శ
తిరిగి పరిమలించేదాకా,
మా నయనాల ప్రాధాన్యం
నిర్వీర్యం అయ్యేదాకా ఇక్కడే దాగుండిపో. 
ఈ వస్తు వ్యామోహ ప్రపంచాన్ని
పూర్తిగా మసకబారించి పో ,
కాంతిని కామించే కుళ్ళు కళ్ళని
పూర్తిగా పూరించిపో ,
 జాతుల మద్య తారతమ్యాలను
మటుమాయం అయ్యేదాకా నిలిచిపో ,
నీతోడు
నీకు తోడుగా
నా శక్తి మేరకు
సూర్య చంద్రులతో యుద్ధం చేస్తూనే ఉంటాను .
 

20150111

ధనం ధనం

పల్లవి "     ధనం ధనం ఇది తరం తరం
                నిరంతరం ధనం ధనం
ఊటే ఉనికై , చెలిమే చెలివై , చేరువై నిలిచి                  "చరణం "        
నిచ్చెన వేసి నింగికి పాకి మేఘం నింపి
నిచ్చెన విరిగి నిలువున ముంచి చెరువే కరువై
చెలిమే చెరచి ఊటే ఇనికి పరువే తీసే                          ''పల్లవి '' 

అక్కరకు వచ్చి అప్పుగ మారి                                     "చరణం "
అరుదుగ దొరికి బిరుదుగ ఎదిగి
కొంతకు కొంతై అంతకు అంతై
ఎవరూ మోయని అసలే తీరని                                     పల్లవి

కష్టం జీతం పెడితే లాభం పోతే నష్టం                             "చరణం "
ఒకడికి కేకు ఒకరికి మేకు
ఒకరికి కాదల్ ఒకరికి కాజల్
కావల్సిందోకటేరోయ్
దగ్గరకు రాని ధనం  ధనం...                                        పల్లవి

వేటకు పూట ఆటకు ఆట                                           "చరణం "
చేతులు మారి చేష్టలు మర్చి
అందరు ఆడేదొకటే మాట  ధనం  ధనం                          పల్లవి

దొరకని దారిలో బాటలు వేసి                                         "చరణం "
బాటసారులను ఇరుకున పెట్టి
కిరికిరి చేసి కిడ్నాప్ చేసి
కంచికి చేరని కథనే ఇదిరా ధనం ధనం                          పల్లవి

జీవం లేని రెమ్మలు ఎగిరి                                            "చరణం "
నవ్వే బొమ్మలు జాతర జేరి
నంబరు కమ్మలు నమిలే ఆటర ధనం ధనం                పల్లవి 

20150107

అంబేద్కర్ గుండెల మీద

ఎన్నో ఏండ్లు గా దాచిపెట్టిన
దారిద్ర్యమది అంబేద్కర్
దళిత వర్ణానికింకా నిర్లక్ష్యపు
సోగాసులద్దుతూనే ఉన్నది
నేర్పేవాడే లేనప్పుడు
నేర్పరి కొరకు రాయితీల జాతర లెందుకోయ్ ?
బహుషా ఆనాడు సాధించిన స్వాతంత్ర్యం
వట్టి మట్టి కోసమేనేమో భీం : అందుకే
ఆ తల్లి కడుపున వాడింకా
బానిస గానే పురుడు  పోసుకున్నడు.
బహుజన స్వాతంత్ర్యానికి మరోయుద్దం
మిగిలే ఉండదని ఊహించడం మరిచావేమో ?
వెలుగులు పంచే వెన్నల కోసం ఎంత వేగంగా వెదికినా
రాలిన తారలే తారస పడుతున్నరు .
సైందవులను జయించాలని చూసిన ప్రతి సారి
నీ చూపుడు వేలు బౌద్ధాన్ని జపిస్తుంది బాబా సాహెబ్.
నువ్వు ఒరిగితే ఓదార్చిన ఆ చెట్టే
అగ్రవర్ణ హరితం తో ముసలిదై మూలుగుతంది.
ఆనాడు పెట్టిన అద్దాల వన్నె తగ్గింది బీ. ఆర్.
పాతవి మార్చి కొత్తదారి చూపవోయ్ .
అవమానపు అనుమానాలేర్పడకుండా వేసుకున్న
ఆ నల్ల కోటిప్పుడు మురుగు కంపు కొడుతుంటే
నువ్విప్పుడుండాల్సింది ఆ రహదారి గద్దెల మీద కాదు అంబేద్కర్ ,
పీతిగొద్దెల మీద బతుకులీడుస్తున్న నా తమ్ముల గుండెల మీద...    

20150101

అపర వార్తా సంజీవనీ

బడి కంటే ముందే
పోద్దటి బదిలీ పొయ్యిన అయ్య
బడి ఇడిసినంక గూడ రాకపోతే
అమ్మా నాన్నెక్కడేనంటూ
జబ్బకేసిన బ్యాగును ఇసిరేసి
  ఏమైందో ఇంత ఆల్షం ఆయే నని
బాయి కాడికి ఉరికిన
చిన్నారుల పాదాలు .
లోడాసు నెక్కరు, నెత్తిన సేఫ్టీ ల్యాంపు
చినిగిన బూట్లతో బడిపోరని లెక్క
ఆయాసం నిండిన దేహం
చెమట నిండిన బనీను
మసి నిండిన ముఖాన్ని
బట్టల సబ్బుతో పెయ్యి రుద్దుకుంటండు.
చెమర్చిన చేతులతో
మరో ప్రాణాన్ని తాకితే
గుండెల నిండిన బరువంతా
ఒక్కసారి దిగినట్టుంది.
ఈడికేందుకచ్చినవ్ రా ?
అని గద్దరించిన ఆ గద్దరింపు లో
తండ్రి రెక్కల కష్టం
పిల్లానికి తెల్వద్దనే తపన మాత్రం
గొంతులో దాగింది.
తెగిన రెక్కకి ప్రాణం ఊది పంపినట్టు
ఎగురుకుంటూ, కాలరెగిరేసుకుంటూ
నానమ్మ నాన్నత్తండే అని చెప్పిన మాట 
ఓ అమ్మ ప్రతీ రోజు వినాలనుకునే
అపర వార్తా సంజీవనీ  ...    

20141231

హాప్పీ న్యూ ఇయర్

నూతన సంవత్సరం
ఆనంద వేడుకలు
హహ్హహ్హ...
జరుపుకోండి
లెక్కించడం మరవొద్దు సుమా
సంవత్సరాన్ని నెలలనే ముక్కలుగా
వారాల చెక్కలుగా
గంటల బొక్కలను
నిమిషాల రక్తపు సుక్కలుగా
నరకండి.
గతేండ్లలో జరిగిన
మారణ హోమాలన్నింటిని
తారీఖులకతికించాలి కదా ,
ఏనాడో జరిగిన విషాద చాయలకు
అచ్చులు పోసి మరీ విలపించండి. 
జరుపుకొండి నూతన సంవత్సర వేడుకలు
ఈ క్షణికం కోసమేనేమో ,
కొన్ని వేల కన్నీటి క్షణాలను
దాటుకుంటూ వచ్చింది.
ఆకాశాన్నంటే కాంతి పుంజాలను
విసురుతూ సంబరపడండి.
జరిగిపోయిన దారుణాలను
రోజుల గోడలకు అతికించి ఆనందిద్దాం.
చితికి పోయిన గడియలను
విడమరిచి వివరిద్దాం.
పాత సంవత్సరం జరిగిన
ప్రతీ విషయాన్ని తడిమెందుకు
కొత్త క్యాలెండర్ ను ఆవిష్కరిద్దాం.
దినాల దిక్సూచి లో పొద్దులన్నీ నలుపెక్కి పోయినవే
నువ్వు నవ్వుకోడానికి అక్కడక్కడ
కొన్ని రోజులే నిర్ణయించబడ్డాయి.
నవ్వే విషయాన్ని మాత్రం
చరవాణి లో ముందే భద్రపరుచుకో
మరిచిన ఆ నవ్వు కోసం
మరెన్నిసార్లు ఏడవాల్సి వస్తుందో ?
ఈ గడియ గడిస్తే
మళ్ళీ మనం సృష్టించుకున్న
అశ్రుప్రవాహం లో
వేగంగా కొట్టుకు పోవాల్సిందే
హాప్పీ న్యూ ఇయర్ టు యు ఆల్.     

20141230

ఆశ

నా తల్లి గుండెల్లో
బంగారు ఖనిజాలున్నయని ,
నేనాడిన జాగంతా
బొగ్గు గనుల కోన అని,
గర్వంగా గొంతేత్తి అరవకముందే .
ఆఫీసులస్తయీ,
అభివృద్ధి చెందుద్ది,
కొలువులస్తే
కొంచెమన్నా కోలుకుంటం,
అచ్చురం నేర్చుకుంటే
గులిగో నలిగో కులవడి
గుమాస్తా గా నన్న పడుంటం అనకుంటే,
సర్కారు సర్వే గాళ్ళు
నా పీక సుట్టూ
కొలతల టేపు సుట్టి
నన్ను అవతలకు నెట్టిన్లు .
 ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్టింగ్ తో
బద్దలైన నా ఇల్లు
సరిదిద్దుకోడానికే
నా సదువంతా  అటుకెక్కింది. 
ఊరికి కొత్తగా వచ్చిన
మెర్సిడెజ్ లారీలు
తినే కంచం ల మన్ను నింపితే,
నోటి ముద్దను ఏరుకోడానికే
ఏండ్లు గడిచింది .
అప్పుడప్పుడు ఏరిగినపుడల్లా
ఎరుపచ్చినా నలుపచ్చినా
 కంపెనీ దవాఖాన్ల ఫిరీ గా
సూపిచ్చుకునే రోజత్తదనే ఆశ 
ఏ కొననో కొట్టుకుంటనే ఉన్నది.

20141224

జీహాద్ జిందాబాద్

జీహాద్ జిందాబాద్ 

ఓ పవిత్ర యుద్దమా నువ్వు కళకాలం వర్దిల్లు .
ప్రతి రోజు వినిపించే నమాజ్
ఇప్పుడు పిల్లల ఆర్తనాదాలు పఠిస్తుంది.
 అల్లాహ్ అక్బర్...  అల్లాహ్ ... 
ఒక్కడైన దేవుడికి పసి హృదయాలను
తూటాలతో గుచ్చి మాల గా వేయాలి .
అల్లాహ్ బిస్మిల్లాహ్ అక్కుబర్ ...
కరుణామయుడైన ప్రభువును
పసి మొగ్గల రక్తం తో అభిషేకించాలి .

నిండుగా నవ్వాల్సిన వార్ ముఖాలు
భయపడుతుంటే ,
నీ మనస్సు ఏమాత్రం చేలించలేక పోయిందా ?
ముద్దొచ్చే కళ్ళలో
కన్నీళ్లు తిరుగుతున్నప్పుడన్నా ,
నీ హృదయ కవాటాలు తెరుచుకోలేదా ?
గల గలా మాట్లాడాల్సిన గది లో
విద్యాకుసుమాల ఆవేదన,
నిన్ను ఒక్కసారి మనిషిగా మార్చలేకపోయిందా ?
 గురి చూసి ట్రిగ్గర్ నొక్కే ముందు ,
నీ బాల్యపు ఛాయలైనా గుర్తుకురలేదా ?

ఇప్పుడు ఇదేగా నీక్కావలసింది ?
ప్రపంచం లో మహిళలందరికీ
బుర్ఖాలు వేపిస్తా .
నా చిన్నారి హృదయాల్లో రక్తాన్ని ఎక్కించవూ ?
తర తరాల మగ జాతి కంతా
మీసాలు కత్తిరించి గడ్డాలు పెంచిస్తా .
నా బిడ్డల బుగ్గలపై నవ్వులు చిగురించనియ్యవూ ?
పదికోట్ల కంటాలతో
 నమాజ్ ని ఈ రాత్రి కల్లా చదివిస్తా ...
రేపటికల్లా తియ్యని పెదాలతో అమ్మా అని పలికించవూ ?
ప్రతి ఒక్కరిని ఈ రాత్రి కి
నీ ఉపవాస దీక్షలో పస్తులుంచుతా ...
కానీ తెలవారే సరికల్లా లేత గొంతుకలతో గిలాసడు పాలు తాగించవూ ?

ఈ క్షణానికి ప్రపంచమంతా
నీవల్ల తల దించుకుని
బాధ తో కన్నీరు కారుస్తుంది.
కానీ ,కానీ ఆ కన్నీరు కరిగి
ఆవిరి గా ఎగిరిపోయే లోపు,
పొద్దెక్కే సూర్యుని కిరణాలు
బాధని తన్నుకు పోయేలోపు
పాటశాల గది లో
పిల్లల సవ్వడి  వినిపించకపోతే,
నా పిల్లల లేత పాదాలను
నేలపై నడిపించక పోతే ,
నిన్ను నిన్ను గా అంతం చేసే
అసలైన పవిత్ర యుద్ధం మొదలైనట్టే .
జీహాద్ జిందాబాద్
ఓ పవిత్ర యుద్దమా
నువ్వు కళకాలం వర్దిల్లు. 

20141223

మత శిక్ష

మత శిక్ష

ఓం నమః శివాయ... 
హయ్యో మతమా
మా హృదయాల్లోకి ఎందుకు ప్రవహించావ్?
పరిశుద్ధ ప్రభువా ...
మాలో మనిషి తనాన్ని ఎందుకు మరిపించావ్ ?
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ ...
ఈ జాతి లో దైవమనే భయాన్ని ఎందుకు నింపావ్ ?
 సహించేది లేదు
మూడ విశ్వాసాలను దులిపేసిన
 మనసును నేను
ఇక సహించేది లేదు 
నేను చీము నెత్తురు తో కోపం నిండిన
మనిషిని నేను
ఇంకస్సలె సహించేది లేదు 
ఇంకెప్పుడైనా ,
మరెప్పుడైనా ,
మతం మత్తులో
 మానవత్వాన్ని ఖాజేయ్యాలని చూస్తే
భూ గోలమంతా మహా ప్రళయం లో మండిపోని
ఆ శివునికైనా గుండు కొట్టిస్తా .
ఏ క్షణమైనా ,
మరేక్షణమైనా,
ప్రార్ధనలు ప్రాణాలను తియ్యాలని చూస్తే
శాంతి కపోతాలు రక్తం చిందించనీ
యెసుకైన మరో సారి శిలువ వేపిస్తా .
ఎక్కడైనా ,
ఇంకెక్కడైనా,
విశ్వాసం పసిపాపల శ్వాసని పీల్చెయ్యాలని చూస్తే
సైతాన్ ప్రపంచాన్ని ఆవహించనీ
అల్లాకైనా కఠిన శిక్ష విధిస్తా.

20141208

స్వేచ్చా మహిళ

స్వేచ్చా మహిళ 

నీ కనుబొమ్మల మద్యన
నిలిచిన ఎర్రని బొట్టును
చూస్తున్నప్పుడల్లా
మత పెత్తనపు హింసనే
కళ్ళల్లో కదలాడుతున్నది.
దయ చేసి ఆ బొట్టు ను తుడిపెయ్యవు.
ఆ చేతి గాజుల చప్పుడు
విన్నప్పుడల్లా
ఓ మతోన్మాది
కత్తి తో కుత్తికలను తెంపిన
అర్థ నాదాలు వినిపిస్తున్నై .
మన్నించి ఆ గాజులను పగల గొట్టవూ.
కాళ్ళ కు పట్టీలు కట్టినప్పుడల్లా
మనుషులను కులాలుగా కుట్టి
కదలకుండా వేసిన బేడీలు గా
కన్పిస్తున్నై .
క్షమించి వాటిని విప్పేయవూ.
విధవ లా ఉన్నావ్ అంటారని భయపడకు
అనేవాళ్ళంతా మత పిచ్చి పట్టిన వెదవలు.
 నువ్విప్పుడే
అసలైన స్వాతంత్ర్యం సాధించిన
స్వేచ్చా మహిళవు .       

శబ్ద శంఖం

శబ్ద శంఖం 

నా తల పై ఆకాశం లేదు
నా పాదం కింద భూమి లేదు
నేనిప్పుడు
మతానికి మానవత్వానికి మద్య
నెక్కి నెక్కి నడుస్తున్నాను .
నా కళ్లిప్పుడు
ప్రపంచాన్ని చూడట్లేదు
వెనుక జరిగిన వేదనను
ముందున్న ముదురు ఎరుపు రంగును
మాత్రమే గమనిస్తున్నది.
నా చెవులిప్పుడు
ఏ శబ్ద తరంగాలను వినట్లేదు
ఆ శబ్ద  శంఖాలను పూరించిన
కంఠాలను వెదుకుతున్నది.
నా ముక్కిప్పుడు
శ్వాసించడం లేదు
ఈ గాలి లో విష వాయువులను
నింపిన వారెవరని వెటాడుతున్నది. 

మనిషితనానికి మతానికి
జరుగుతున్న మానసిక యుద్ధం ,
ఆయుధాలు ధరించిన వాడే
ప్రతిసారి విజయం సాధిస్తున్నడు.
అయినా ఈ పాదం
పదునైన కత్తుల మీద
నెత్తురు గక్కుతుంది.
ఏదో ఒక నాడు పారిన ఈ నెత్తురే
మానవత్వం వికసించిన
రహదారి అవుతుందని. 

20141205

చెత్త పిలగాడు

చెత్త పిలగాడు 

వాడిపడేసిన మల్లె మొగ్గలు
తన స్పర్శ తో తిరిగి పరిమళిస్తాయి .
ఆ చేతి అయస్కాంత మహిమో మరేమో
విహరించె వరుకులన్నీ వాడి చెంత చేరాయి .
ఏ సాధనం లేని సౌందర్యం
 దుమ్ము తో ఆ మొహం చిగురిస్తుంది .
మనం బతికున్నంత వరకు
వాడు మనల్ని బతికించడానికే
 బతుకులీడుస్తడు .
ప్లాస్టిక్ వద్దంటూ ఫ్లెక్సీ ల్లో కన్పించే
 నినాదాలన్నీ వాడి సంచి లో నిండిపోయాయి.
మోసపోయిన ప్రియుల విరహ గీతాలు
వినిపించే విరిగిన సిమ్ములూ
చీకట్లో చల్లిన వర్షాలకు చిద్రమైన గొడుగులు
తడిచి ముద్దైనా తప్పక తొలగిస్తాడు వాడు.
చెప్పులు లేని కాళ్ళు
గూడలు తెగిన ఎంతమంది కుళ్ళును మోస్తుందో
సమయ పాలనైనా సాంఘిక పాలనైనా
వాన్ని చూసే నేర్చుకోవాలెవరైనా
ఏ కాగితము చెత్త కాదు ,
అది వాన్ని చేరాలనే చిత్తూ గా మారుతుందేమో ?

నిద్రించే ఒక రాత్రి ఆ చెత్తే వాని మెత్తని పరుపు ,
చలేసే మరోరాత్రి ఆ కవర్లే వెచ్చని దుప్పట్లు,
వానొచ్చే ఇంకోరాత్రి ఆ సంచే వాని పిట్ట గూడు,
నిద్దుర లేచి జబ్బ కేసే ఆ మూటే వాడి టెడ్డి బేర్ .
ఇప్పుడు వాడు మోస్తున్నది చెత్త బుట్ట కాదు
సమస్త జనుల పాపాల కుప్ప . 

He row in

He row  in  

తెర మీద నాజూగ్గా కన్పిచే శరీరం
తెర వెనుక ఎంత చిద్రమైందో ?
ఆట లో కత్తిరించకుండా
తన దేహాన్ని కత్తిరించుకుంటే,
ఇంచు ఇంచు కు రేటు కట్టి ,
అంగాంగాన్ని ఆస్తులుగా అమ్ముకునే  నిర్మాత.
తన  దేహం ఒక మర్రి చెట్టు .
వాలిపోయే ప్రతీ మగాడు
తన దృష్టి లో పిట్ట రెట్టే ,
వాసనా మత్తులో మునిగి
లొట్టలేసుకుంటూ చూసేదే వీక్షకులు.

క్లాప్ కి ముందు ప్రతి వాని
పక్క చేరితే గానీ
కథకు కథానాయిక కాలేని తను
మనకు తెరపై కన్పించేది
తనువు మాత్రమే ,
మేకప్ వేస్కునే ప్రతీసారీ
మనసుకు మత్తు మందిస్తుంది.
ఇరువైనాలుగు రాత్రుల్లో
రక్కిన గాయాలు కన్పించకుండా
కాస్మోటిక్స్ తో ముఖానికి నవ్వు ను
అతికించుకున్నది హీరోయిన్ కాదు
he row  in  

20141201

కుష్టు రోగం

అతి పెద్ద ప్రజాస్వామ్యం లో
పార్టీలన్నీ చేతులు కల్పాయి
దేశాన్నెలా దోచుకోవాలా అని.
ఓటేస్న పోటు గాన్ని పట్టి మరీ
చూపుడు వేలుకు చుక్కనంటిచ్చారు.

వేస్న ఓటు గెల్చినోడ్కి దాసోహం అయ్యింది ,
అంటిన చుక్క అంతకంతకు పెరిగి
కుష్టు రోగం అయింది.

కార్పోరేట్ గద్దలన్నీ
పిక్కల్లో మాంసాన్ని పీక్కుతిన్నా
చచ్చు బడిన శరీరానికేం తెలుస్తుంది.

గుండెల్లో గునపాల్ని దించి
రక్తాన్ని పిండేస్తు , కాషాయాన్ని  ఎక్కిస్తున్నా
ఈ కళ్ళింకా భ్రమ పడుతున్నాయ్ వ్యాధి
తగ్గించే వ్యాక్సిన్ అని .  

20141127

వెలిగించడం కోసమే

వెలిగించడం కోసమే 

మదమెక్కిన అధికారం
మానవత్వాన్ని అవమానిస్తూనే ఉంటుంది .
మరచిపోయి , సమాజం తో కలసి పోడానికది
పీడ కళైనా బాగుండు ,
పారిపోయి ప్రాణాలైనా కాపాడుకోడానికది
ఒకసారి జర్గే దాడైనా కాదే ?
అడుగు అడుగు కు
తారస పడే కళ్ళకు పట్టిన పచ్చ కామెర్లు .

అధికారపు అంధకారాన్ని
పటాపంచెలు చెయ్యటానికి
ప్రతీ అవమానం ఎక్కడో ఒకచోట
ఆడవి పువ్వులను వెదుకుతూనే ఉంటది,
 ఓ కథకుడు కర్శకుడిలా
ఆ కర్మాగారం లో పువ్వు పువ్వునీ జత చేస్తూనే ఉంటాడు,
ఓ పరిశోధకుడు శ్రామికుడిలా
ఆధునిక వంగడాలను పాత్రల్లో పూరిస్తుంటాడు .
నల్లమల కిరీటాలు ధరించిన అగ్గిపుల్లలు
ఏ క్షణాన నీరసపడవు , నిరుత్సాహపడవు .
ఒక్క తూటా తో నేలకొరిగిన దేహాలాన్నిటికీ తెలుసు
తాము వెలగడం కోసం కాదు , వెలిగించడం కోసమే అని. 

20131202

ఇతురుల ఆధారమే మన ఆనందానికి మూలం కాకూడదు .
ఆ ధార నే నిరాధారం అయితే మన కన్నీటి ధారనే ధారావాహిక అవుతుంది.

20131118

మళ్ళీ అడుగు

కలిసి మెలిసి ఆడిన పదాలన్నీ
మీతో కలిసి పరిగెత్త లేక
అలిసి ఎక్కడెక్కడో జారి పడ్డాయి .
ఇంకొన్ని మీ కాళ్ళ సందుల్లోనే పడి
కోన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి .

గమ్యం లేని మీ పరుగుల ప్రయాణం లో,
మీకెరుక లేకుండానే ఎన్నో తరాలు మారాయి.
తరానికీ తరానికీ మద్య ఎన్నో అంతరాలు,
ప్రతీ తరం తెలియకుండా దాచిన అంతరంగాలు.

ఇన్ని రంగాల్లో ఆరితేరిన మీరు
మా తరాలను ఎన్నడో మరిచే ఉంటారు .

మీ లాంటి వాళ్ళకొరకే స్వరాష్ట్రం
ఒక వజ్రాయుధమై వచ్చింది .

మేల్కోండి ,
ఒక్కసారి నిన్నటి రాత్రుల్లో
దాగిన చీకట్లని చీల్చి,
తరాల వెలుతురును ధరించండి .

మీ తాత ల నోట్లో ఆడిన ఆణిముత్యాల
అవశేషాల్ అస్థికల్ అదిగో అవే
కన్పిస్తున్నయా ??

మరెన్నో పదాలు అస్తిపంజరాలై
వేలాడుతున్నై , గమనించండి .

మీ ఇంటి మూలల్లో పట్టిన
పరాయి బూజును చూసి
మురిసిపోతున్నారా ?

పగిలిన మీ ముఖాలను
దుమ్ము పట్టిన అద్దం లో చూస్తూ
అందగాళ్ళని ఆనంద పడుతున్నారా ?
హహ్హహ్హః

ఈ రాష్ట్ర వెలుగులు బహుషా
మిమ్మల్ని తాకలేదేమో ఇంకా ?

ఆ బూజును దులిపి
మే ముని వేళ్ళ తో ఆ అద్దాన్ని తాకండి .
ఆ వేళి ముద్రల్లో అసలు నిజాలు కన్పిస్తై .

ఇగో ఇక్కడే దశాబ్దాలు గా
ఎలుగని లాంతరు
మూలాన మొలకు వేలాడుతుంది .
మంత్రాలూ తెలిస్తే అది
అల్లావుద్దిన్  అద్భుతదీపం .
మీ పొడి చేతులతో దాన్ని నిమిరి
వత్తిని వెలిగించండి .
ఆ వెలుగు లో మీకు చారిత్రిక
ఆనవాళ్ళు అగుపిస్తాయి .

ఇక పదండి
తొంట చేతిలో లాంతరు
కుడి చేతిలో వజ్రాయుధం తో
నా తో రండి .
మిమ్మల్ని స్వరాష్ట్ర
స్వేచ్చా తీరాలకు చేరుస్తా .   

20131023

ననీలె

ఎండలు దిగని 
వెన్నెల శాల.
కవ్వాల్ 
అభయారణ్యాలు. 

                                                                    ఉద్యమ తుపాకిల 
                                                                    పేలిన 
                                                                    తొలుసూరు తూట
                                                                    శ్రీకాంతన్న. 

దేశమంతా గాడంగా 
నిద్రిస్తున్నా ,
నా జాగలింకా 
సీకట్లు మొలవలేదు.

                                                                      పొలికేకల
                                                                      అరుపుల్లో, 
                                                                      కోడి కూతల 
                                                                      ఉదయాలుండవులే. 

మా గడపగడపకూ, 
రాలిన మందారాల 
నెత్తుటి మరకల 
బొట్లే.

                                                                   విచ్చుకోవే 
                                                                   విప్లమా ...
                                                                   నీ అందాల్ని 
                                                                   ఎన్నాళ్లని దాచుకుంటావేఅలా ?

దేశాలన్నీ
కన్నీరొడుతున్నాయ్. 
యువకులారా 
వచ్చి ఓదార్చండి.

                                                                    ముండ్లచెట్ల 
                                                                    మధురఫలాల 
                                                                    తీయదానాన్ని 
                                                                    అనుభవించే సమయమైంది.

నా కళ్ళన్నీ,
చెదిరిపోయిన
పాత అడుగులనే
వెదుకుతున్నాయి...

                                                                    నీ విద్య కావాలొక 
                                                                    కురిసే సినుకైనా ,
                                                                    మొలిచే
                                                                    మొలకైనా ...

నా వినయం 
నువ్వు విననప్పుడు, 
నా విద్వేషమేగా 
నిను పలకరించేది.

                                                                      నేడు నిర్మించే
                                                                      నయా నగరాలన్నీ,
                                                                      నిన్నటి త్యాగపు 
                                                                      దేహాల మీదనే...

భూమిని నమ్మిన వాడు 
శవం ఐతండు .
అమ్మిన వాడు 
రాజైతండు నేడు.

                                                                    విత్తనమే విషమైనప్పుడు 
                                                                    రైతన్నా ,
                                                                    రక్తమే గా 
                                                                    ఎరువేయ్యాలి. 

బల్సింది .
డోరా బొర్రా,
గడ్డి తిన్న బర్రె, 
పాలేరు పేగే పల్సవడ్డది .
20131019

In complete

నా అడుగు 

ఆలు చిప్పల్లో ముత్యం లా,
లేత టెముకలతో,
రక్తాన్నే మాంసపు తెరలా
మార్చుకున్న ఈ పాదం,
బుడి బుడి అడుగులు
వెయ్యడం నేర్వక ముందే,
అయ్య కాళ్ళ పిక్కల్లో
రక్తం సెమట సుక్కలై
రాలే సప్పుల్లకు,
అవ్వ ఒడి లోనే
దరువెయ్యటం మొదలెట్టింది .

అమ్మ కొంగు చాటునే,
బతుకమ్మ కు కదిలిన అడుగులే
కదన రంగాన
దుముకే తీరును చూపిస్తుంది.

పాటలై జారే పదాలన్నీ,
లేత పాదాలను
మొరటుగా మారుస్తున్నై.

బతుకమ్మ ల మీద
వెలిగే దీపాల వేడి,
పాల బుగ్గలకు సెగ తగిలించి
గాండ్రించేందుకు గొంతును
సవరించింది.

అస్త వ్యస్త
సమాజపు
అధికుల, ఆధికుల,
ఆధిపత్యకుల
వలసత్వ , వారసత్వ,
తామస పోకడలకు
తారా జువ్వలై
వెలుగును పంచేందుకు ...

బురదలోనే మొలచి,
తామర తత్త్వం
తమదని భ్రమించి,
అంటరాని తనం,
ముట్టరాని పని  ,
మైల పట్టిందని,
మాయ మాటలతో
మా చేతులతో
మీ పాదాలు మొక్కించి
ఆశీర్వాదం అని
అణగద్రోక్కుతూ ,

ఆది గోడలు తమవని,
మాది గోడలు  నీచమని,
నికృష్టపు నియమాలు
నిండుగా నింపుకుని
లేని రాతలతో
నిత్య నీచపురోగితులై,

అలసత్వపు జవసత్వాలు
అసత్యపు అరుపులతో,
మాటల్లోనే వేదాలు వల్లిస్తూ,

బతుకునీడ్వడానికి
నిర్మించుకున్న
మాయా కట్టడపు
గర్భాల చాటున
సామ్రానీలు చల్లడాన్ని
సహించలేకనే ...

నవమాసాలు
అనుభవించే కష్టాన్ని,
నవ దినాల్లోనే అనుభవిస్తూ,
అణగారిన సమాజపు
అశ్రువుల్లోంచి మొగ్గ తొడిగింది
పూల వన జాతర.
__________
______
___
_

గడపలన్నీ
గర్భ గుడులుగా మార్చి,
మలినం పట్టిన దేవుళ్ళను
మైల చేతుల తోనే...

ఒక్కో శ్వాస తో
పువ్వు పువ్వు నూ జత కట్టి,
శ్రీ యంత్రానికి ఏమాత్రం
తీసి పోనట్టు సింగారించి,

బంగారు ఆభరణాలు గా
తంగేడు పూలు,
కెంపుల హారంగా
సీత జడ పూలు,
ముత్యాల హారంగా
ముద్దబంతి పూలు,
ఏడువారాల నగలు
మా నూరువరాల పువ్వులు.

ముఖానికంతా
పసుపును పూసి ,
గుమ్మడి పువ్వుగా కూర్చోబెట్టి
గౌరమ్మ ను ,

మాటలే మంత్రాలూ గా
నడకలే ఆచారలుగా
దేవతలనే చెక్కిన శిల్పులు.

ఆఖరి కుల కాంత లందరూ
మహా రాణులై,
మట్టి గోడల్లో నిండిన
మానవత్వపు పుష్కరాల
తివాచీలు వీధుల్లో పరిచి,
పేర్చిన పల్లాలే శటగోపాలు,
తల పై ఎత్తిన బతుకమ్మలు

గడపగడపకో దేవత
గర్వంగా
బయటకడుగులు పెడుతూ,
సాగే ప్రవాహాలు
సాగరం లో ఉప్పెనలు,

ముక్కోటి బతుకమ్మలు
ఒక్కటై ,
అలికి ముగ్గేసిన కాడికి
జేరే ఉత్సవ మూర్తులు.

మైదానలే
మహా దేవాలయాలు ,
మహిళలే
అర్చక మల్లెలు,
ఏ దేవునికందని
మహా నైవేద్యాల
సత్తులు, అగరొత్తులు
పసిడి పువ్వులు
ప్రాణం ఉన్న దేవతలు,
విరబూసిన రెమ్మలు
విరగబడి నవ్వే సురులు,
దీప మకుటాలు ధరించిన శిరులు,

చేతి చప్పట్లే మృదంగ వాద్యాలు,
జత కాలిసి వేసే అడుగులు
అంబరాన్ని దించే మయూర నాట్యాలకు
సంబరం తో తల లాడించే
దీప కాంతి శిఖర కిరీటాలు.

ఏ దేవి దిగి వచ్చు
దివి నుండి భువికి,
మట్టి మనుషుల
బతుకమ్మ లు తప్ప...
_______
_____
___
_

ఇది రాళ్ళను కడిగే
రాచరికం కాదు,
గోత్రలడిగి గోముత్రాల ప్రసాదాల
గురించి భయపడకండి.

శిలను ముట్టుకుని
చిల్లర వేయమని ప్రాధేయపడే
హుండీల గుడారాలుండవికడ ...
______
___
_

భయ కంపిత ఉరుముల్లో,
జ్వల కంపిత మెరుపుల్లో,
సాగలేక దాగిన సూర్యుని పయనం ,
సడీ సప్పుడు లేని సందురుని
వెన్నెల పందిరి కూలినప్పుడు,
________
_____
__

నా తల్లి గుడి గుండెల్లో 
మోగే మొరటు గంటలను .
____________
___
__

ఈ రాత్రికొక స్వాతంత్ర్య వేడుక...

TO BE CONTINUED...

20131016

ప్రాంతీయ వాది

ప్రాంతీయ వాది

నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా.
నేను నా ప్రజల్ని ప్రేమిస్తున్నా.
నేను నా ప్రాంతాన్ని ప్రేమిస్తున్నా.

"కరుడు గట్టిన ప్రాంతీయ వాది "
ఆ ప్రేమకి ఈ సమాజం నాకు పెట్టిన పేరు.

అవును నేను ప్రాంతీయ వాదినే ,
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నంత కాలం .

నేను విభజన వాదినే,
ప్రపంచం అంతా పరభజన గావిస్తున్నంత కాలం.
స్వపక్షమే విపక్షమై విబెదించినంతకాలం.

20131015

naneelu

కొండ శిలువలున్నై
శిలువలు మోసే 
కష్ట జీవుల సుఖాలు 
మింగేందుకు 


                                                     దేశ వనిత వక్షోజాలపై 
                                                     చూపు దించి ,
                                                     మాడిపోయే పేగులను
                                                     లెక్కించు.

గాడిదలై  
నాయకులను మోస్తున్నారు 
అభివృద్ధి 
తీరాలను చేరేందుకు 

                                                      శ్రామికుల 
                                                      రొండ్లన్నీ ముండ్ల దెబ్బలే 
                                                      సమాజ కచ్రాన్ని 
                                                      నడిపించేందుకు 


జలపాతాలు.
కామాందుల
 వృషణాల్లోంచి ,
స్త్రీ మూర్తి కన్నుల్లోంచి.


మురికిని వదిలించెందుకు 
స్నానం.
గబ్బును దాచుకునేందుకే 
స్ప్రేలు .


పాణం లేని ఉరుముల్లో, 
ఊర పిచ్చుకల గోడు 
గోరంతే కదా...
సర్కారోడ ?

వెలుగుతూ వెలుగునిచ్చే 
సూర్యుడా ?
చీకట్లో ఉంటూ వెలుగునిచ్చే 
కార్మికుడా ? గొప్ప...

శేదేది ఒకడు,
నింపుకునేదింకొకడు,
శేదబావి కాదు ,
బొగ్గు బాయి .

పవలించేందుకు 
సిద్దం చేసిన్లు 
నా దేశాన్ని,
విదేశీ పెట్టుబడికి.

పూలల్లో పూలై 
ప్రవహిస్తున్లు 
మా అవ్వలు 
నిండు బతుకమ్మలై 

పెద్ద బతుకమ్మ
బరువెక్కింది.
బానిస బతుకులు 
మోయలేక.

నింగి కేగసిన 
తారలు.
ఉపగ్రహం,
పొలం లో రైతన్న. 

కోపెన్ హెగెన్, 
బయో డైవర్సిటి 
సదస్సులన్నీ, 
మా ఊరి చెట్లతీర్థాలే.

కాలిన 
దేహాలన్నీ 
బతుకమ్మల మీద 
క్రాంతి కాంతులీనుతున్నై.

వీర వనితలు 
పసుపులద్దుకుని 
కూసున్నరు, 
గౌరమ్మలై .

సీత జడ పూల 
చిక్కదనం,
పారిన రక్తపుటేర్ల 
చిహ్నమే .

స్వదేశీ ప్రేమే
ప్రాంతీయ వాదం.
విదేశీ దోపిడెపుడు
సమైఖ్య గానమే.

పూల వనం మీద
కోయిల గుంపు
వాలినట్టుంది.
బతుకమ్మ జాతర లో.

బతుకమ్మ
ఎదిగిన తాంబూలం
శిశుపాలుని వధకు,
సిద్ధంగా ఉంది.

ఒక పూటే కూడుకు,
మరో పూట కూడళ్ళకు ,
పుటల్లేని
నిరుద్యోగి .

సమైఖ్యం లో
బందీ ఐన
పిచ్చుకలు
నింగి కెగిరే వేళయ్యింది.

కష్టాల పొరకల్ని
కడుపులో దాస్కోని
నవ్వడమే
బతుకమ్మ.

కుంభ కోణపు
మెరుపుల్లో
దిగుడు దీపపు
కాంతులెవడు దేకును.

ప్రపంచమొక రక్తవర్ణచిత్రం
కార్మిక గుండెలు
రంగులు
చిందిస్తున్నై కామ్రేడ్

బానిసత్వపు
కొసన  పూసిన
ఓ మందారమా ...!
నువ్వు వికసించేదెన్నడో ?

శోభల్లేని
బాధా తప్త
నగర మెట్లాయేరా
అశోబాద ?

నా పట్నాన్ని
సాని కొంప జేసి
సంస్కారం అంటున్రు,
స్వార్ధాంద్రులు .

కంసాంద్రులకు
క్యాబినెట్ ఆమోదమొక
ఆకాశ వాణి
హెచ్చరిక.

కమ్మరి కొలిమిల
సరిసిన సబ్బల్లు,
ఒగ్గు
కళాకారులు.

దేశం కోసం
బాడర్లో జవాన్లు,
ప్రజల కోసం
జంగల్లో జవాన్లు.

సేల్లెల్లారా
సందమామలే
సలికాలానికి
దుప్పెట్లవుతున్నాయా ?


ఓ కపటాంధ్రుడా
ప్రాంతాలు ప్రజలకే గానీ,
పారే
నదులకు కాదురా ...

అమరుల రక్తం తో
నిండిన ఒక తార
సంధ్యాకాశం లో
వేలాడుతుంది సూర్యునిలా...

ఆకాశపు
హరివిల్లుల పట్నం లో
లేనిదొక్కటే
ప్రేమ ...

20131008

వెలివేసిన సమాజం

వెలివేసిన సమాజం

నేనే గ్రహనమైతే,
పగడపు దీవిలో 
పగిలిన రాయిలా విడిపోనా ?
ప్రవహించే నది లో 
పతనమై పరిగెత్తనా ?

నేనే అస్తమయాన్నైతే, 
తెలవారుతుందని   
చీకటిలా చెదిరిపోనా ?
నింగిలో
తెగిన తారలా రాలిపోనా ?

నేనే విషతుల్య మైతే 
నిశ్చింత గా 
నా రక్తాన్ని పారపోయనా ?
పచ్చని చెట్టులో 
ఎండిన ఆకై రాలి పోనా ?

నేనే కష్టాల కన్నీటినైతే,
ఈ ప్రపంచాక్షముల నుండి 
ఏనాడో దుమికి వేయనా ?
లేక ఈనాటికే 
ఈ దేహాన్ని దిహించి వేసుండకపోదునా ?

నేనే అబద్దం అయితే,
ఈ నిజాల నిండు సభలో 
నెత్తురు గ్రక్కకపోదునా ?
నిర్దాక్షిణ్యంగా  
శిరచ్చేదనం గావించకపోదునా ? 

సమాజమా 
తప్పు 
నీదైతే...???

   

20131002

మనుషులుగా మార్చండి

 మనుషులుగా మార్చండి
ఓ ఉదయించే సూర్యుడా ...
మాలో మానవత్వాలను మేల్కొల్పు,
ఓ వర్షించే మేఘమా ...
మసిబట్టిన కామముసుగుని కడిగించు,
ఓ ప్రవహించే నదీనదమా ...
మా స్వార్దాలను సముద్రం లో కలుపు,
ఓ ప్రజ్వలించే అగ్నిహోత్రమా...
మా క్రోదాలను దహించు,
పంచ భూతాల్లారా
కనీసం మమ్మల్ని మనుషులుగా మార్చండి.       

20131001


నానీలు...

ప్రపంచోద్యమ
నిప్పుకనికలన్నీ
ఈడనే
ఎగసి పడుతున్నై

                                                         విప్లవం పుట్టి
                                                         సాహిత్యానికి తోడై
                                                         జన జీవనానికి
                                                         సొగసులద్దింది

తుపాకులు పేల్చిన
చేతులు
 కలాలతో అక్షరాలు
నాట లేవా ?

                                                       అడవి బిడ్డలు
                                                       శాంతి కపోతాలు
                                                       అణచి వేస్తే
                                                       అల్లూరి వారసులు

మాజీలము
కాదు మేము
మావో కు
ఆత్మలం


నీకిది
జన స్రవంతి లో ఉన్నట్టు
నాకిది
గళ స్రవంతి లో ఉన్నట్టు

                                                                నా కత్తులు
                                                                కల్లు గీస్తే,
                                                                బిడ్డా “గీత” దాటితే
                                                                కంటాలూ తెంపుతై

సాగరహారం
విహంగానికెగిరిన
పక్షుల సమాహారం
ఎగరడమే విప్లవం

                                                                   మా గాణం అంతా
                                                                   ఒకటే ఆట
                                                                   పేరిణి నృత్యమే
                                                                   యుద్ద ప్రేరణ

మొలకెత్తిన విత్తనాలను
మోడు చెట్ల తో
కప్పేసిన్లు
ఈ సమైక్యం లో


కైకేయి చెల్లి
విజయమ్మ
కానీ ఈడ భరతుడూ
బద్మాష్ గాదె

                                                              ఈ మట్టి లో
                                                              ఎక్కడ అడుగేసిన
                                                              రక్తపు మడుగుల
                                                              ఆనవాళ్ళే

సాకలి కుంపటి
సాలె మగ్గమా ? హవ్వ
సామ్రాజ్య వాదం
విస్తరించలేదా ?

                                                       మగ్గం ఆడుతలేదు
                                                       ఎందుకా ?
                                                       దూళానికి ఏల్లాడుతండు
                                                       ఆ మనిషి

చేజార్చిన
సిల్క్ మహా సామ్రాజ్యానికి
సిర్ సిల్క్
ఒక మూగ సాక్షం


నేటి సమావేశం
లూథర్ కింగ్
యువ గళాలతో
నిండిపోయింది

                                                             దండి మార్చ్
                                                             ఒక స్వాతంత్ర్య ఆకాంక్ష
                                                             మిలియన్ మార్చ్
                                                             ఒక అస్తిత్వాకాంక్ష

 తూటాలు దిగిన
గుండెలివి
తుపాకి రాముని
మాతలోలేక్కా ?

                                                                   మట్టిల మాణిక్యాలు
                                                                   వెతుకుతనవా ?
                                                                   తెలంగాణా పో
                                                                   వజ్రాలై ఎల్గుతున్రు

రాజకీయం
ప్రజల రాజ్యం
అడ్డదారది
అడవి దారిటువైపు


జలియన్ వాలా బాఘ్
ఇంద్రవెల్లి
హిమాయత్ నగర్
తుపాకి సప్పుల్లు

                                                                 వసంతం వస్తూ
                                                                 పూలు తెచ్చింది .
                                                                 వీరులారా వచ్చి
                                                                 రంగులు పులుముకోoడి

ఉద్యమ నాగలి
కళా నేలను దున్నింది
రత్నకాంతులీనుతోంది
ఈ నెల

                                                               నగలు మీ మెడలలో  
                                                               నగదు మీ చేతుల్లో
                                                               మా చేతుల్లో నిప్పులు
                                                               మా మెడలకి ఉరి తాళ్ళు

నక్సలైటు
నువ్వు పెట్టిన పేరు
అన్నలు  ప్రజలు
పిలిచే పేరు


అడవి తల్లి
ఒడిలో
సనుబాల ముద్దు బిడ్డలు
గోండులు రా  

                                                              పాలపిట్ట ఎనకాల
                                                              పిలుసుకుంట
                                                              రా రా తమ్మి
                                                              మీ పిలుపందుకుంటం

భగత్,ఆజాద్ లు
మళ్ళీ అమరులైన్లు
మాతృ భూమి
అస్తిత్వం కొరకు

                                                           ఎలిసేది కాదిది
                                                           ఎడతెరిపిలేని
                                                           రాళ్ళ వాన
                                                           సాయుధ మేఘాల జోరు   

శాంతి స్తాపనకే
సద్దుల బతుకమ్మ
కుదరదంటేనే
ఆయుధ పూజ